మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఈగల్ టీమ్) ఇన్చార్జి డీఎస్పీ బుచ్చయ్య పిలుపునిచ్చారు.
ఇచ్చోడ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రాయల్ ప్యాలెస్‌లో విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బుచ్చయ్య మాట్లాడుతూ, దేశంలో మరియు రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలు యువతను, ముఖ్యంగా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాలకు అలవాటు పడేలా చేస్తున్నాయని తెలిపారు.
డ్రగ్స్‌కు బానిసైన వారు తమ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
చదువుతో పాటు సమాజ విలువలు, బాధ్యతలను నేర్చుకుని భావి భారత పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా వినియోగం చేస్తున్నట్టు తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, టోల్‌ఫ్రీ నంబర్ 1908 కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలియజేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జలై జాకు, ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, సీఐ రాజు, ఎస్సై రమేష్, వివిధ పాఠశాలల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












