హైదరాబాద్‌లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు, యువతికి హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడితో బాధిత యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే, నిశ్చితార్థం తర్వాత మనోహర్‌కు హెచ్ఐవీ ఉన్నట్లు తెలియడంతో యువతి, ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ సంఘటనతో మనోహర్ యువతిపై కక్ష పెంచుకున్నాడు.
ఈ నెల 11న మనోహర్ యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. యువతి అంగీకరించకపోవడంతో, మనోహర్ ముందుగా సిద్ధం చేసుకున్న సిరంజితో హెచ్ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఆమెకు బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు.
యువతి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, వైద్య పరీక్షల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో యువతి తండ్రి పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. యువతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.


