బోథ్ మండలంలో జొన్న పంటలో అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 74 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బోథ్ సీఐ డి. గురుస్వామి తెలిపిన వివరాల ప్రకారం, చింతల్ బోరి గ్రామానికి చెందిన కాంబ్లే ముకుందరావు (63), ధర్మపురి గ్రామానికి చెందిన కనక మారుతి (28) గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించారు. కనక మారుతి వద్ద రెండు గంజాయి మొక్కలు ఉండగా, అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, మొక్కలను కాంబ్లే ముకుందరావు వద్ద కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు.
దీంతో పోలీసులు కాంబ్లే ముకుందరావు పొలాన్ని తనిఖీ చేయగా, జొన్న పంటలో అంతర పంటగా సాగు చేస్తున్న 74 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
గంజాయిని సాగు చేయడం, రవాణా చేయడం, వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. గంజాయి సాగు చేసిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని సిఫార్సు చేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వ్యసనాల బారిన పడకూడదని సూచించారు.
ఈ ఆపరేషన్లో బోథ్ ఎస్సై వి. పురుషోత్తం, సిబ్బంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.












