నిర్మల్ పట్టణ అభివృద్ధికి మంజూరైన రూ. 15 కోట్ల నిధులకు సంబంధించిన పాత టెండర్లను రద్దు చేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
బీజేపీ నాయకులు రావుల రాంనాథ్ మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషితోనే నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చారని, దీని ద్వారా తాగునీటి సౌకర్యం, మురుగునీటి శుద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పట్టణ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేయబడ్డాయని, అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ టెండర్లను రద్దు చేయడం అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆరోపించారు.
ఈ టెండర్ల రద్దు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని రావుల రాంనాథ్ హెచ్చరించారు. అనంతరం, బీజేపీ నాయకులు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ధర్నాతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.








