కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ మరియు అమెరికా దళాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయని ఆరోపించుకుంటున్నాయి. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో దాడి చేసిందని అమెరికా ఆరోపించగా, అందుకు ప్రతిగా టెహ్రాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రతిదాడి చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అమెరికా నాశనం చేసింది. అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన క్షిపణి- డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, కమాండ్`కంట్రోల్ ప్రదేశాలు, ఇంటెలిజెన్స్- నిఘా యూనిట్లను లక్ష్యంగా చేసుకున్నాయని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరిస్తూ, ఒప్పందంపై తక్షణమే సంతకం చేయాలని కోరారు. దాడులను ఆయన ‘స్నేహితులు సరదాగా కొట్టుకునే చిన్న పంచ’గా అభివర్ణించారు. చర్చలలో అనిశ్చితి ఏర్పడిందని, అయినప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, వాటిని తమకు అప్పగించాలని అమెరికా ప్రతిపాదించిందని, అందుకు ఇరాన్ కూడా అంగీకరించిందని ఆయన తెలిపారు. అయితే, అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ ఇంకా స్పందించలేదని టెహ్రాన్ మీడియా చెబుతోంది.
ఇరాన్లో పేలుడు శబ్దాలు వినిపించాయని, ఖెష్మ్ దీవి, బందర్ అబ్బాస్ సమీపంలో ఇరాన్ భద్రతా దళాలు, అమెరికా సేనల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని టెహ్రాన్ ప్రభుత్వ మీడియా ఫార్స్ న్యూస్ తెలిపింది. ఎలాంటి అనుమతులు లేకుండా హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న కొన్ని నౌకలకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) హెచ్చరికలు జారీ చేస్తోంది.
యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఇరాన్ వైపు క్షిపణులు, డ్రోన్లు వస్తున్నాయని, వాటిని ఎదుర్కొనే పనిలో ఉన్నామని తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ దేశవ్యాప్తంగా సైరన్లు మోగించారు. ప్రశాంతంగా ఉండాలని, అధికారులు జారీ చేసే భద్రతాపరమైన ఆదేశాలను పాటించాలని ప్రజలను కోరారు.












