భారత్‌కు వస్తున్న థాయ్‌లాండ్‌కు చెందిన 'మయూరీ నారీ' అనే సరుకు రవాణా నౌకపై హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ మిసైల్స్‌తో దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. మిగతా 20 మందిని ఒమన్ నేవీ సురక్షితంగా కాపాడింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
యూఏఈలోని ఖలీఫా పోర్టు నుంచి బయలుదేరి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తున్న 'మయూరీ నారీ' నౌకపై హార్మూజ్ జలసంధి వద్ద మిసైల్స్ దాడి జరగడంతో ఇంజిన్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న 23 మంది సిబ్బందిలో ముగ్గురు గల్లంతయ్యారు. మిగతా 20 మందిని ఒమన్ నేవీ రక్షించి సురక్షితంగా ఒమన్‌లోని ఖాసబ్ పట్టణానికి చేర్చింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించడం, నౌకా వాణిజ్య స్వేచ్ఛకు అడ్డంకి కలిగించడం తక్షణమే ఆపాలని భారత్ స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఘర్షణ నేపథ్యంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పేర్కొంది.
ఐఆర్జీసీ నేవీ కమాండర్ అలీరెజా తంగ్ ష్రీ మాట్లాడుతూ, హార్మూజ్ మీదుగా వెళ్లే నౌకలు తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, హెచ్చరికలను పట్టించుకోని నౌకలపై దాడి చేసినట్లు తెలిపారు. బుధవారం హార్మూజ్ జలసంధిలో మూడు నౌకలపై దాడులు జరిగాయని, అందులో 'మయూరీ నారీ' ఒకటి అని ఆయన పేర్కొన్నారు. ఈ దాడులు అమెరికా, ఇజ్రాయెల్ ప్రతీకారంగా జరుగుతున్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది.
ఇరాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ కంపెనీలపై కూడా మిసైల్స్, డ్రోన్లు ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ రెండు డ్రోన్ బాంబులతో దాడులకు పాల్పడగా, ఈ ఘటనలో ఒక భారతీయుడితో సహా నలుగురు గాయపడ్డారు. విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి.


