సారంగాపూర్, జులై 15
సారంగాపూర్ మండలంలో తాటి, ఈత చెట్లను నరికిన కుమ్మరి నరసయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సారంగాపూర్ మండల గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. రాజకీయ అండదండలతో సుమారు 50 చెట్లను నరికించిన నరసయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
సారంగాపూర్ మండలంలోని సారంగాపూర్ గ్రామంలో తాటి, ఈత చెట్లను నరికిన కుమ్మరి నరసయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సారంగాపూర్ మండల గౌడ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. తమ జీతగాళ్లతో సుమారు 50 తాటి, ఈత చెట్లను నరికివేయించిన నరసయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం సభ్యులు ఎల్లా గౌడ్, నవీన్ గౌడ్, సాయ గౌడ్, విశ్వేశం గౌడ్, జీవన్ గౌడ్లు అన్నారు.
రాజకీయ అండదండలతోనే చెట్లను నరికివేశారని, తాను ఏమి చేయలేరనే అహంకారంతోనే ఈ పనికి పాల్పడ్డాడని వారు ఆరోపించారు. ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్లాది రూపాయలు ఖర్చుచేసి గౌడుల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణ కోసం తాటి, ఈత, ఖర్జూర చెట్లను నాటుతుంటే, గ్రామాల్లోని పెత్తందారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెట్లను నరికివేస్తూ గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నరసయ్యను వెంటనే అరెస్టు చేసి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎక్సైజ్, పోలీస్, అటవీ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మోకు దెబ్బ తరపున డిమాండ్ చేశారు. వారిని అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.












