భైంసా మండలం లోని దేగాం గ్రామ సర్పంచ్ సిరం సుష్మరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి అధికారికంగా ఎంపికయ్యారు. జిల్లా నుంచి ఇద్దరికి ఈ శిక్షణలో పాల్గొనే అవకాశం దక్కింది.
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, నిర్మల్ జారీ చేసిన ఆదేశాల మేరకు గ్రామ సభలు, సమాచార హక్కు (ఆర్టీఐ) మరియు ప్రజాప్రతినిధుల సామర్థ్య అభివృద్ధి అంశాలపై హైదరాబాద్లోని డా. ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి. ఇన్స్టిట్యూట్లో జూలై 16 నుండి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో సిరం సుష్మరెడ్డి పాల్గొననున్నారు.
గ్రామీణ పాలనలో మహిళా ప్రజాప్రతినిధుల నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడం, గ్రామ సభల నిర్వహణ, సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా దేగాం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు నాయకులు సర్పంచ్ సిరం సుష్మరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.












