హైదరాబాద్, 2026-06-05
పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం హామీ ఇచ్చారు. జీవో 97ను రద్దు చేయాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థులు, నేతలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కోదండరాం హామీ ఇచ్చారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీలో వచ్చిన అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోనని ఆయన స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ పాలిటెక్నిక్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎరవెల్లి జగన్ అధ్యక్షతన జీవో 97ను రద్దు చేయాలని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేతలు, విద్యార్థుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాంతో పాటు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, విద్యార్థి నేతలు ఎరవెల్లి జగన్, గోపు జనార్ధన్, ఆజాద్, సుధీర్, పలువురు పాలిటెక్నిక్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ వ్యవస్థలోనే విద్య, నైపుణ్యం రెండూ ఉన్నాయని కోదండరాం అన్నారు. జీవో 97పై విద్యార్థులు, నేతలు ఇచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రభుత్వానికి హెచ్చరికలు
శక్తి స్కీంపై పట్టుదలకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వానిదే పరువు పోతుందని ఎంపీ ఆర్ కృష్ణయ్య సూచించారు. నైపుణ్యం లేనివారికి నైపుణ్యం నేర్పించాలని, డిప్లొమా విద్యార్థులకు ముందు నుంచే నైపుణ్యం ఉందని, దీనికి వారు ఏటా పొందుతున్న క్యాంపస్ ఉద్యోగాలే నిదర్శనమని తెలిపారు. జీవో 97పై వెనక్కి తగ్గితే ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందని, ఒకవేళ మొండిగా వ్యవహరిస్తే పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
జీవో 97పై విమర్శలు
విద్యాశాఖలో ఉన్న ను కార్మిక శాఖలోకి కలపడం సరికాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. తాము స్కిల్ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదన్న ఆయన, నైపుణ్య అభివృద్ధికి, సాంకేతిక విద్యకి తేడా ఉంటుందని గుర్తు చేశారు. ఎంత గొప్ప చరిత్ర, ట్రాక్ రికార్డు కలిగిన పాలిటెక్నిక్ విద్య వ్యవస్థను నాశనం చేసేందుకే జీవో 97ను తీసుకువచ్చారని విమర్శించారు. ఇకనైనా కళ్ళు తెరిచి శక్తి స్కీంను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు.
పాలిటెక్నిక్ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే జీవో 97ను తీసుకువచ్చారని ఓయూ జేఏసీ, టిఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్, నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆలోచించి జీవో 97ను రద్దుకు సహకరించాలని కోదండరాంకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రవణ్ గౌడ్, శ్రీరామ్, రాష్ట్ర అధ్యక్షులు వివేక్ పటేల్, జర్జ్ రెడ్డి కన్వీనర్ స్వాతి, రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరావు, అశోక్ రెడ్డి, రాహుల్ నాయక్, వైశాలి, , మసాబ్ ట్యాంక్ కాలేజ్, పఠాన్ చెరువు, సికింద్రాబాద్, దుర్గ బాయ్ దేశముఖ్ మహిళ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రణీత, విశాల్, అభిరామ్, ఇర్ఫాన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.












