సారంగపూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 01
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని సారంగపూర్లో ప్రారంభించింది. జామ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గోడ పోస్టర్ ఆవిష్కరణతో ఈ కార్యక్రమం మొదలైంది.
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తోందని జిల్లా కమ్యూనిటీ మొబిలైజర్ పసుల రమేష్ తెలిపారు. సారంగపూర్ మండలం జామ్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన గోడ పోస్టర్ను సర్పంచి కరిపె రవళి విలాస్తో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, 45 రోజుల పాటు నిర్వహించే శిక్షణతో యువతకు ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఎన్ఎస్డీసీ గుర్తింపు పొందిన ధ్రువపత్రంతో పాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. గ్రామంలోని అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సర్పంచి రవళి విలాస్ మాట్లాడుతూ, యువత కోసం ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి, యూనిఫాం, షూస్, ల్యాప్టాప్ బ్యాగ్ అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.












