మిర్యాలగూడ, జులై 27
త్రిపురారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ప్రాథమిక ఉపాధ్యాయుల సమగ్ర వృత్యంతర శిక్షణ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంఈఓ రమావత్ రవి మాట్లాడుతూ, విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి రెమెడియేషన్ ద్వారా వారిని ముందుకు తీసుకువెళ్లడం ఉపాధ్యాయుల బాధ్యత అని, ఎఫ్.ఎల్.ఎన్. లక్ష్య సాధనకు ఇది కీలకమని తెలిపారు.
పాఠశాలల్లో రెమెడియేషన్ను సమర్థవంతంగా అమలు చేయాలని త్రిపురారం మండల విద్యాధికారి రమావత్ రవి అన్నారు.
త్రిపురారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ప్రాథమిక ఉపాధ్యాయుల సమగ్ర వృత్యంతర శిక్షణ సోమవారం విజయవంతంగా ముగిసింది. శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎంఈఓ రవి ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయి భిన్నంగా ఉంటుందని, అందువల్ల అభ్యసన లోపాలను గుర్తించి రెమెడియేషన్ ద్వారా ప్రతి విద్యార్థిని అభ్యసనంలో ముందుకు తీసుకువెళ్లడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ఎఫ్.ఎల్.ఎన్. లక్ష్యాలను సాధించడంలో రెమెడియేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి పాఠశాలలో దీనిని క్రమబద్ధంగా అమలు చేయాలని సూచించారు.
శిక్షణలో తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులకు సంబంధించిన రెమెడియేషన్ వ్యూహాలు, విద్యార్థి కేంద్రిత బోధనా పద్ధతులు, నిరంతర మూల్యాంకనం, సమూహ బోధన, కార్యాచరణ ఆధారిత అభ్యసనం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. తెలుగులో ధారాళ పఠనం, భావగ్రహణం, సరైన ఉచ్చారణ, పఠన వేగం, పఠన అవగాహన పెంపొందించే పద్ధతులను వివరించారు.
ఆంగ్లంలో ఎల్.ఎస్.ఆర్. డబ్ల్యు. నైపుణ్యాలను అభివృద్ధి చేసే కార్యాచరణలు, పదసంపద పెంపు, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధిపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. గణితంలో భావనాత్మక అవగాహన, సంఖ్యాజ్ఞానం, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, టి.ఎల్.ఎం. వినియోగం, విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి రెమెడియేషన్ ద్వారా సరిదిద్దే విధానాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
ఈ శిక్షణలో మండల రిసోర్స్ పర్సన్స్ అయిన తెలుగు- సతీష్, మధు మోహన్, ఆంగ్లం- మధుకుమార్, గణితం- హఫీజ్, తమ తమ సబ్జెక్టులపై నాణ్యమైన శిక్షణను అందించారు. కార్యాచరణ ఆధారిత బోధన, సమూహ చర్చలు, ప్రదర్శనలు, ప్రాక్టికల్ యాక్టివిటీల ద్వారా ఉపాధ్యాయులను చురుకుగా భాగస్వాములను చేసి శిక్షణను విజయవంతంగా నిర్వహించారు. శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు అత్యంత ఉత్సాహం, చురుకుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని శిక్షణను విజయవంతం చేశారు.
శిక్షణ ముగింపు సందర్భముగా ఎంఈఓ రవి నాణ్యమైన శిక్షణను అందించిన అన్ని మండల రిసోర్స్ పర్సన్ లను ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.












