నిర్మల్, జూలై 30
నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా నేడు (గురువారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నేడు (గురువారం) జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.
భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులు, నీటి ప్రవాహాలు అధికంగా ఉన్న ప్రాంతాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం అందించి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని పేర్కొన్న జిల్లా యంత్రాంగం, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.












