కుబీర్, 3 July
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని మాలేగాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పాఠశాలలో కనీస అవసరమైన టాయిలెట్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. ముఖ్యంగా బాలికలు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని మాలేగాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఆధునిక విద్యను ప్రోత్సహిస్తూ ఈ పాఠశాలను ఏఐ విద్య అమలుకు ఎంపిక చేసినప్పటికీ, విద్యార్థులకు అత్యవసరమైన టాయిలెట్ సౌకర్యం ఇప్పటికీ అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థులు చదువుతుండగా, టాయిలెట్ లేకపోవడంతో ప్రతిరోజూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా బాలికలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సమస్య పరిష్కారంపై దృష్టి సారించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
విద్యా ప్రమాణాల పెంపు పేరుతో కొత్త కార్యక్రమాలు అమలు చేయడం మాత్రమే కాకుండా, పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదులు వంటి కనీస మౌలిక వసతులు కూడా కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి టాయిలెట్ నిర్మాణ పనులు చేపట్టి విద్యార్థుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లా ఉన్నతాధికారులు మాత్రం ఏసీ రూముల్లో కూర్చొని విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తున్నారన్న విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నప్పటికీ మండలంలో ఎక్కడ కూడా తనిఖీలు నిర్వహించిన దాఖలాలు లేవని పలువురు మండిపడుతున్నారు. ఏసీ రూముల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.











