నిర్మల్, 2 July
ముధోల్ మండలంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) వినతి మేరకు, విద్యార్థినులందరినీ త్వరలోనే సకల సౌకర్యాలతో కూడిన నూతన భవనంలోకి తరలిస్తామని ASWO మేడమ్ హామీ ఇచ్చారు.
ముధోల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహ విద్యార్థినుల సమస్యలపై అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) చేసిన ప్రయత్నం ఫలించింది. విద్యార్థినుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ (AIPSU) నిర్మల్ జిల్లా కార్యదర్శి గడపాలి పరమేష్ ఆధ్వర్యంలో నిర్మల్ డివిజన్ ఏఎస్డబ్ల్యూఓ (ASWO) మేడమ్ గారికి గురువారం వినతిపత్రం అందజేశారు.
గత మూడేళ్లుగా పాత భవనం శిథిలావస్థకు చేరడంతో సుమారు 50 నుండి 70 మంది విద్యార్థినులను ఒక ప్రైవేట్ 2BHK భవనంలోకి మార్చారు. అక్కడ కనీస సదుపాయాలు (మరుగుదొడ్లు, స్నానాల గదులు, చదువుకునే స్థలం) లేక ఇరుకైన వాతావరణంలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని AIPSU నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, అప్పటివరకు విద్యార్థినులను సకల సౌకర్యాలున్న సురక్షిత భవనంలోకి మార్చాలని డిమాండ్ చేశారు.
AIPSU నాయకుల వినతిపై ASWO మేడమ్ గారు సానుకూలంగా స్పందించారు. ఇది కేవలం ఎస్సీ బాలికల వసతి గృహం అని స్పష్టం చేసిన ఆమె, విద్యార్థినుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, త్వరలోనే అన్ని మౌలిక వస్తువులు మరియు సకల సౌకర్యాలు కలిగిన నూతన భవనానికి వసతి గృహాన్ని షిఫ్ట్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
అధికారుల సానుకూల స్పందన పట్ల అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) హర్షం వ్యక్తం చేసింది. త్వరలోనే ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులను సురక్షిత భవనంలోకి మార్చాలని వారు కోరారు.











