ఖానాపూర్, 4 September
మండలంలోని బావాపూర్ కె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. సంతోష్ నిర్మల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సంఖ్య పెంపు, సృజనాత్మక కార్యక్రమాల నిర్వహణలో ఆయన కృషికి గుర్తింపు లభించింది.
బావాపూర్ కె పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ ( మండలంలోని బావాపూర్ కె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. సంతోష్ నిర్మల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి సమాచారం అందింది.పి. సంతోష్ ప్రధానోపాధ్యాయుడిగా పాఠశాల నిర్వహణ బాధ్యతలు చేపడుతూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అదే సమయంలో మండల, కాంప్లెక్స్, జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేసి పంపడంతో పాటు పాఠశాల పరిపాలనను సమర్థంగా నిర్వహిస్తున్నారు.ప్రభుత్వం అందించే నిధులతో పాటు తన సొంత ఖర్చులతో విద్యార్థుల కోసం టీవీ, రేడియో, సౌండ్ సిస్టమ్ వంటి పరికరాలను సమకూర్చి విద్యార్థులకు పాటలు, ఇతర విద్యా కార్యక్రమాలను నేర్పిస్తున్నారు. పాఠశాలలో సృజనాత్మకతను పెంపొందించేలా పెయింటింగ్స్ వేయించడం, వాటికి అవసరమైన పేపర్లు, రంగులను సొంత ఖర్చులతో అందించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు.గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ సహకారంతో ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 33 నుంచి 80కి పెంచడంలో సఫలీకృతులయ్యారు. విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ప్రతి పండుగను ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలో బాలికలకు గోరింటాకు పండుగ నిర్వహించడంతో పాటు బోనాల పండుగ సందర్భంగా విద్యార్థులతో బోనాలు, పోతరాజుల విన్యాసాలు, పాటల కార్యక్రమాలు నిర్వహించారు.పాఠశాలలో ఆటపాటలతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యమివ్వడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సంతోష్ తెలిపారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ తాను చేసిన పనిని గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. అయితే ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు. అవార్డు ఎంపికపై గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తూ సంతోష్‌ను అభినందించారు.












