కామారెడ్డి, 1 August
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల నుండి అక్రమంగా డబ్బు వసూలు చేస్తుందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఒక్కో విద్యార్థి నుండి రూ.4 వేల చొప్పున మొత్తం రూ.6 లక్షలు వసూలు చేశారని, వెంటనే ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ దురుసు ప్రవర్తనపై, నాణ్యత లేని బోధనపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక లిటిల్ స్కాలర్ పాఠశాలలలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అడ్మిషన్ ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థి నుండి నాలుగు వేల రూపాయలు చొప్పున, మొత్తం సుమారు ఆరు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. వెంటనే ఆ డబ్బును విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
ఫీజుల విషయంలో ఎవరైనా ప్రశ్నిస్తే ప్రిన్సిపల్ స్వాతిప్రియ దురుసుగా ప్రవర్తిస్తుందని, డీఈఓ ఆదేశాలతోనే ఫీజులు వసూలు చేస్తున్నామని చెబుతోందని నాయకులు తెలిపారు. విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాలతో కుమ్మక్కయ్యారా అని వారు ప్రశ్నించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్‌ను వెంటనే తొలగించాలని వారు కోరారు.
గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయకుండానే ఇష్టానుసారంగా 50 వేల నుండి 60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని, అయినప్పటికీ సరైన సదుపాయాలు, ఆటస్థలం, మూత్రశాలలు, మరుగుదొడ్లు కల్పించలేదని ఆరోపించారు. అర్హత కలిగిన టీచింగ్ సిబ్బంది కాకుండా ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులతో పాఠాలు చెప్పిస్తున్నారని, ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు.
వెంటనే తమ డిమాండ్లను పాఠశాల యాజమాన్యం పరిష్కరించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బివిఎం జిల్లా అధ్యక్షులు జీవియం విట్టల్, బిడిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నిమ్మ సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్, పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి సురేష్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు చరణ్, విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్, జివిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ నాయక్, విద్యార్థి సంఘాల నాయకులు పెరుమండ్ల బుల్లెట్ చక్రవర్తి, నితిన్, అర్బస్, సాయినాథ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాలు పుస్తకాలతో కూడిన గదిని సీజ్ చేయించాయి.









