కొండమల్లేపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
కొండమల్లేపల్లిలో గుర్తింపు రద్దు అయిన 'ఎస్పిఆర్ ఉన్నత పాఠశాల'ను తక్షణమే మూసివేసి, సీజ్ చేయాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు కేతవాత్ బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు. అక్రమ అనుమతులిచ్చిన నాటి అధికారులపై, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పాఠశాల మూసివేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ఉత్తర్వుల ప్రకారం కొండమల్లేపల్లిలోని 'ఎస్పిఆర్' పాఠశాలను వెంటనే మూసివేసి, సీజ్ చేయాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు కేతవాత్ బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు. అక్రమ అనుమతులు ఇచ్చిన నాటి జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి, మోసపూరిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. పాఠశాలను మూసివేసే వరకు ఆందోళనలు ఆపేది లేదని స్పష్టం చేశారు.
కొండమల్లేపల్లిలో చట్టవిరుద్ధంగా, న్యాయస్థాన ఉత్తర్వులను ధిక్కరిస్తూ నడుస్తున్న "ఎస్పిఆర్ ఉన్నత పాఠశాల" (సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా సంస్థల సొసైటీ) గుర్తింపును విద్యాశాఖ పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (హైదరాబాద్) పూర్తిగా రద్దు చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, అధికారులు సదరు పాఠశాలను మూసివేసి సీజ్ చేయకపోవడం శోచనీయమని కేతవాత్ బాబురామ్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు రద్దయిన పాఠశాలను జిల్లా యంత్రాంగం తక్షణమే మూసివేసి సీజ్ చేసే వరకు ప్రత్యక్ష పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండమల్లేపల్లిలోని వెంకటేశ్వర కళాశాల భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎస్పిఆర్ ఉన్నత పాఠశాల నడుపుతున్నారని 2024 జూన్ 07న జిల్లా పాలనాధికారి (కలెక్టర్)కి ఆధారాలతో ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. నాటి ఫిర్యాదుతో అధికారులు కొన్ని రోజులు పాఠశాల మూసివేసినప్పటికీ, నాటి నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా ప్రైవేట్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లా వాణిజ్య న్యాయస్థానంలో సదరు సొసైటీ 'ఎస్పిఆర్' అనే పేరును ఉపయోగించకూడదని స్పష్టమైన ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, నాటి జిల్లా విద్యాశాఖాధికారి బిక్షపతి ఆ న్యాయస్థాన స్టేను తొక్కిపెట్టి, విచారణ జరపకుండా దొంగతనంగా మళ్లీ 10 సంవత్సరాల (2025-2035) తాత్కాలిక గుర్తింపు మంజూరు చేసి తీవ్ర అక్రమానికి పాల్పడ్డారని మండిపడ్డారు. దీనిపై తాము ఆధారాలతో విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) ఉత్తర్వుల మేరకు పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (హైదరాబాద్) సమగ్ర విచారణ జరిపారన్నారు. విచారణలో సర్వేపల్లి రాధాకృష్ణ సొసైటీ అక్రమాలు, ట్రేడ్మార్క్ నిబంధనల ఉల్లంఘన రుజువు కావడంతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జూలై 21, 2026 నాటి ఉత్తర్వుల ద్వారా కొండమల్లేపల్లి ఎస్పిఆర్ ఉన్నత పాఠశాల గుర్తింపును, అనుమతులను రద్దు చేశారని తెలిపారు.
అనుమతులు రద్దయినప్పటికీ సదరు యాజమాన్యం నామఫలకాలు (బోర్డులు) మార్చకుండా తల్లిదండ్రులను మోసం చేస్తూ అక్రమంగా తరగతులు నిర్వహిస్తుంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.










