మిర్యాలగూడ, జులై 15
అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు భారత్ పెట్రోలియం సంస్థ రూ. 51 వేల విలువైన కూల్ వాటర్ ప్లాంట్ను అందించింది. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రమావత్ వరలక్ష్మి సంస్థను అభినందించారు. పాఠశాల అభివృద్ధికి ఇలాంటి సహకారం ఎంతో అవసరమని ఆమె అన్నారు.
అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు భారత్ పెట్రోలియం సంస్థ రూ. 51 వేల విలువైన కూల్ వాటర్ ప్లాంట్ను అందించడం అభినందనీయమని మండల విద్యాధికారి రమావత్ వరలక్ష్మి అన్నారు. బుధవారం అడవిదేవులపల్లి హైస్కూల్లో గ్రామ సర్పంచ్ కూరాకుల చిన్న రామయ్య, తహసిల్దార్ రాగ్యానాయక్, ఎస్సై శేఖర్, పెట్రోలియం సంస్థ ప్రతినిధులతో కలిసి ఆమె కూల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు.
అనంతరం పాఠశాలలోని 50 మంది విద్యార్థులకు టీ షర్టులను అందజేశారు. పాఠశాల ప్రాంగణం, పరిసర ప్రాంతాలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించడంతోపాటు, ప్రతి ఇంట్లో మొక్కలు నాటి, పరిరక్షించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలన్నారు.












