బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలంలో తెలంగాణ ప్రజా పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మండల వాసులు బుధవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లేని ఏకైక మండలం సోనాలేనని, దీంతో విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు తెలిపారు.
బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలంలో తెలంగాణ ప్రజా పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మండల వాసులు బుధవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బోథ్ నియోజకవర్గంలోని పది మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేని ఏకైక మండలం సోనాలేనని తెలిపారు. దీంతో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వివరించారు.
పక్కనే ఉన్న మండలాల్లో విద్యాసంస్థలు అందుబాటులో ఉన్నప్పటికీ, సోనాల మండలంలోని విద్యార్థులు కళాశాల విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చిన్నారుల నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకేచోట నాణ్యమైన విద్య అందించే తెలంగాణ ప్రజా పాఠశాలను సోనాల మండలంలో ఏర్పాటు చేయాలని కోరారు.
వినతిని స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సోనాల మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.












