వనపర్తి, జూలై 15
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, వారి చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులే రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పలుగు, పార పట్టిన చేతులే కలాలు పట్టి తెలంగాణ రాత మార్చాలని విద్యార్థులను ఉద్దేశించి ఆయన అన్నారు.
వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడిన సీఎం, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. చదువే భవిష్యత్తును నిర్ణయిస్తుందని, సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుందని చెప్పారు.
ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని 27.50 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ.1,000 కోట్లకు పైగా వ్యయంతో తొమ్మిది రకాల వస్తువులతో కూడిన తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లు అందజేస్తామని ప్రకటించారు. కిట్ల నాణ్యతపై విద్యార్థులు వాట్సాప్ ద్వారా అభిప్రాయం తెలిపే విధంగా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, బదిలీలను పూర్తి చేశామని, 317 జీవో వల్ల విడిపోయిన కుటుంబాలను ఒకచోట చేర్చామని తెలిపారు.
విద్యా రంగంలో తెలంగాణ పనితీరు మెరుగుపడిందని, కేంద్రం ప్రకటించిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో రాష్ట్రం 36వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరుకుందని చెప్పారు. ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు ఉపాధ్యాయులను విదేశాలకు పంపుతున్నామని, వచ్చే ఏడాది మరింత మందికి అవకాశం కల్పిస్తామని వెల్లడించారు.
ఏఐ యుగంలో నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరిగిందని, విద్యార్థులు జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలను నేర్చుకుని ప్రపంచ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులుగా ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా సుమారు రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని సీఎం తెలిపారు.












