నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన యోగేష్ (20) అనే యువ డ్రైవర్, ప్రేమ వివాహం తర్వాత జరిగిన పరిణామాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం, యోగేష్ తన చుట్టపు బంధువు అయిన షెల్కె నవనీతను గత నెల 25న ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం కొద్దిరోజులు హైదరాబాద్‌లో గడిపిన ఈ జంట, తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు.
అయితే, ఇరు కుటుంబాల నుంచి, ముఖ్యంగా అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి వివాహానికి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. గ్రామ పంచాయతీలో జరిగిన పంచాయతీలో అమ్మాయి యోగేష్‌ను నిరాకరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యోగేష్, ఈ నెల 5వ తేదీన పురుగుల మందు సేవించాడు.
కుటుంబ సభ్యులు వెంటనే యోగేష్‌ను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం యోగేష్ మృతి చెందినట్లు లోకేశ్వరం ఎస్సై అశోక్ తెలిపారు.
మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ వివాహం నేపథ్యంలో జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.








