బెంగళూరులోని RR నగర్లో ఒక కొడుకు తన పక్షవాతంతో బాధపడుతున్న తల్లిని అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేశాడు. తల్లి సంరక్షణ భారంగా మారిందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పక్షవాతంతో మంచాన పడిన 75 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కుమారుడు వెంకటేష్ కనికరం లేకుండా అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి బయటకు తోసివేశాడు. ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
తల్లిని చూసుకోవడం తన వల్ల కావడం లేదని, ఆ భారం నుండి విముక్తి పొందడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తల్లిని కనికరం లేకుండా చంపిన కొడుకుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దర్యాప్తు పురోగతిపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.












