మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
భీమారం పోలీసులు అందించిన వివరాల ప్రకారం, పొల్లవేని రాజేందర్ మరియు ఆలం మధుకర్ అనే ఇద్దరు వ్యక్తులు కొంతకాలంగా గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న అనంతరం, వారిని వైద్య అధికారి సమక్షంలో ప్రత్యేక కిట్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించగా, గంజాయి వినియోగం నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో వారిపై ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ 27(b) ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.
భవిష్యత్తులో గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువకులు తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తామని ఎస్సై హెచ్చరికలు జారీ చేశారు.
యువతను చెడు వ్యసనాల నుండి దూరం చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. గంజాయి వినియోగం గురించి సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.












