జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌లో దారుణ హత్య జరిగింది. నాలుగు నెలల గర్భవతి అయిన భార్య వైష్ణవిపై భర్త చిత్తరి హరిబాబు కత్తితో దాడి చేసి చంపాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోరుట్లకు చెందిన హరిబాబు, మాదాపూర్‌కు చెందిన వైష్ణవి ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్‌లోనే నివాసముంటున్నారు. హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తుండగా, వైష్ణవి రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపేది.
గత కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే మంగళవారం వేకువజామున 4 గంటలకు హరిబాబు భార్య వైష్ణవిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం కుటుంబసభ్యులు వైష్ణవిని రక్తపుమడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారైన నిందితుడైన భర్త హరిబాబు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై స్థానికంగా కలకలం రేగింది.











