హైదరాబాద్లోని అల్వాల్లో కన్నతల్లినే హత్య చేసి, ఇంట్లోనే పాతిపెట్టిన దారుణం వెలుగుచూసింది. ఈ కేసులో కూతురు, అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంఘటన వివరాల ప్రకారం, అల్వాల్లో నివాసం ఉంటున్న అంజు అనే మహిళ ఏడాది క్రితం అదృశ్యమయ్యారు. ఆమె అదృశ్యంపై పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయగా, చిన్న కూతురు, ఆమె భర్త తల్లి ఆచూకీపై సరైన సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు.
పోలీసులు అనుమానాస్పద కేసుగా దీనిని పరిగణించి లోతుగా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా, చిన్న కూతురు, ఆమె భర్త కలిసి తల్లి అంజును హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలు లేదా ఆర్థికపరమైన కారణాలు ఈ హత్యకు దారితీశాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.








