అదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అటవీశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు నిర్వహించి, లంచం తీసుకుంటున్న అటవీ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్ఓ) ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరుశురాంలను అదుపులోకి తీసుకున్నారు.
ఉపాధి హామీ పథకం కింద మొక్కలకు నీరు పోసిన పనులకు సంబంధించి రూ.5.9 లక్షల బిల్లులు మంజూరయ్యాయి. ఈ బిల్లులను విడుదల చేయడానికి ఎఫ్ఆర్ఓ ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరుశురాం బాధితుడి నుంచి రూ.40 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం రూ.15 వేలకు కుదరడంతో, గురువారం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పట్టుబడిన ఇద్దరినీ విచారణ నిమిత్తం కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జి. మధు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీని సంప్రదించాలని ఆయన సూచించారు. అవినీతి నిర్మూలనలో ప్రజల సహకారం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనతో అటవీశాఖలో అవినీతి వ్యవహారాలు బయటపడటం స్థానికంగా చర్చకు దారితీసింది. అధికారులు ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.












