అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ముధోల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నిర్మల్ జిల్లా కన్వీనర్ మూడపెల్లి దినేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముఖ్య అతిథి మూడపెల్లి దినేష్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీవితం, ఆయన చేసిన సేవలు, సమాజానికి అందించిన విలువల గురించి వివరించారు. అంబేద్కర్ సమానత్వం, సామాజిక న్యాయం, విద్య ప్రాముఖ్యత వంటి అంశాలను ఆచరణాత్మకంగా రాజ్యాంగ నిర్మాణంలో పొందుపరిచారని తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. "కొందరి వాడు కాదు అంబేద్కర్, అందరి వాడు అంబేద్కర్. సమాజంలో మార్పు తీసుకురావడానికి అంబేద్కర్ ఆశయాలే మార్గదర్శకం" అని ఆయన పేర్కొన్నారు.
యువత అంబేద్కర్ బాటలో నడిచి, చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సాయికుమార్, అరుణ్, సంతోష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను స్మరించుకున్నారు.








