మెండోరా మండలంలోని దూదిగాం గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలకు నివాళులర్పించారు.
దూదిగాం గ్రామం రాజీవ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి గ్రామ సర్పంచ్ హరోన్ రషీదు బాబా, గ్రామ పరిపాలన అధికారులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, అంబేద్కర్ దేశ చరిత్రలో అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషి చేసిన మహనీయుడని, ఆయన ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
గ్రామ సెక్రటరీ భరత్ గౌడ్ మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సమానత్వం సాధించడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో దూదిగాం అంబేద్కర్ సంఘాల నాయకులు, వార్డు సభ్యులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు.












