సమాజంలో పెరుగుతున్న కులతత్వం, దాని దుష్పరిణామాలపై తెలంగాణ ఎకనామిక్ ఫోరం, కరీంనగర్ అధ్యక్షుడు నేదునూరి కనకయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మానవత్వమే ముద్దు అని, కులతత్వాన్ని కూల్చి, ప్రగతిశీల సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నేదునూరి కనకయ్య మాట్లాడుతూ, సమాజంలో కులమే బలంగా, కుట్రలు కుయుక్తులే బలగంగా మారాయని, ఇది ఉద్రిక్తత, ఉన్మాదం, హింసోన్మాదాలకు దారితీసి సామాజిక అశాంతికి కారణమవుతోందని పేర్కొన్నారు. కుల కుమ్ములాటల్లో ప్రేమ, కరుణ వంటి మానవతా విలువలు మాయమవుతున్నాయని, మతం పేరున మారణహోమాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కులతత్వం వల్ల సమాజ విచ్చిన్నం, విద్వంసం జరిగి అభివృద్ధి మందగిస్తోందని, అణువిస్ఫోటనం కన్నా కులవిస్ఫోటనం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. విద్య కుల అహంకారాన్ని తుంచి, కుల రహిత సమాజ స్థాపనకు దోహదపడాలని, పరువు హత్యలకు చరమగీతం పాడాలని, సామాజిక సమత, సామరస్యం, ఐక్యతకు విద్య చోదక శక్తి కావాలని ఆయన అన్నారు.
గుణం లేనివారు కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, జనులంతా ఒక కుటుంబం అనే భావనతో ప్రగతిశీల సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. నేర రహిత, అవినీతి రహిత రాజకీయాలు రావాలని, ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా, ఓటును అమ్ముకోకుండా సమర్థులకు, ప్రగతిశీల ప్రజాప్రతినిధులకు పట్టం కట్టాలని సూచించారు.
మేధావులు, విద్యావంతులు, యువత, మహిళలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి, దుర్రాజకీయాలను మట్టుపెట్టాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీలు ధనస్వామ్యాన్ని అడ్డుకొని, అభ్యర్థి సేవా గుణం, ప్రజా సంబంధాల ఆధారంగా టికెట్లు కేటాయించాలని, కులం కన్నా గుణం, అహంకారం కన్నా అభివృద్ధి, ఆందోళన కన్నా ఆలోచన మిన్న అని ఆయన ఉద్ఘాటించారు. పలాయనవాదం వద్దు, ప్రగతిశీలత ముద్దు అని, కులతత్వాన్ని కూల్చి, మానవత్వ పరిమళాల వ్యాప్తితో దేశ ప్రగతికి బాటవేసి, భారత్‌ను 'వసుదైక కుటుంబం'గా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.












