మనిషి సంఘ జీవి అని, తన అవసరాల కోసం ఇతరులపై ఆధారపడి జీవిస్తాడని, సామాజిక సంబంధాలు, పరస్పర సహకారాలు మానవుని ఉన్నతికి ఊతమిస్తాయని తెలంగాణ ఎకనామిక్ ఫోరం, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు. చక్కటి అనుబంధాలే మనిషికి ఆయురారోగ్యాలని, కుటుంబం, అనుబంధం మనిషి జీవితానికి ఒక రక్ష అని ఆయన పేర్కొన్నారు.
మనిషి కష్టాల కడలిలో ఉన్నప్పుడు ఓదార్పు గొప్ప ఆయుధంగా పనిచేస్తుందని, మనసును తేలిక పరిచి ఆందోళనను దూరం చేస్తుందని కనకయ్య వివరించారు. కన్నీరు కారుతున్నప్పుడు తుడిచే చేయి వెయ్యి ఏనుగుల బలం కంటే గొప్పదని, చిరునవ్వు పలకరింపు ఆశలకు టానిక్ లా పనిచేస్తుందని, ఉషారుకు ఉత్ప్రేరకమవుతుందని తెలిపారు.
మనసు విప్పి మాట్లాడే మాట భారమైన హృదయానికి ఊరటనిస్తుందని, ఇతరులతో పంచుకునే ప్రేమే ప్రాణవాయువులా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఆర్ధత, ఆప్యాయత పునాదులపై అందించే ఆత్మీయత ఆయుష్షును పెంచుతుందని, మందులు వ్యాధిని నయం చేస్తే, చక్కటి అనుబంధాలు మనసుకు బలమిస్తాయని, మమత, మానవీయతను పెంచి పోషిస్తాయని పేర్కొన్నారు.
ప్రేమను మించిన విటమిన్ లేదని, స్నేహాన్ని మించిన వైద్యం లేదని, 'నేను ఉన్నాను, నేను వస్తాను' అన్న అభయాన్ని మించిన ధైర్యం లేదని కనకయ్య ఉద్ఘాటించారు. అందుకే మనుషులను ప్రేమించాలని, మంచి బంధాలను నిలబెట్టుకోవాలని, అనుబంధాల గుడి కట్టుకోవాలని ఆయన సూచించారు. ఆర్ధత, అణుకువ, ఆప్యాయతే ధ్యేయంగా, ఆందోళన రహిత జీవనశైలితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కుటుంబం, అనుబంధం మనిషి జీవితానికి ఒక రక్ష అని, ఎన్ని కోట్లు సంపాదించినా దొరకని నిధి కుటుంబమని కనకయ్య అన్నారు. కష్టకాలంలో వెన్ను తట్టి నిలిచేది కుటుంబమేనని, కుటుంబమే భద్రతకు, ఓదార్పుకు పునాది అని వివరించారు. కుటుంబ వ్యవస్థ సుస్థిరతే మనిషి జీవితానికి సార్థకత చేకూరుస్తుందని, ఆత్మీయ అనుబంధాలు దీర్ఘాయువునిచ్చే జన్యువులను ఉత్తేజపరిచి ఆరోగ్యానికి మేలు చేస్తాయని, ఒత్తిడిని తగ్గించి మనోవికాసానికి చేయూతనిస్తాయని ఆయన పేర్కొన్నారు.








