భీంగల్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
భీంగల్ పట్టణంలో ఆదివారం ఊర పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. గ్రామదేవతల తయారీకి అవసరమైన మామిడి మొద్దులను సేకరించేందుకు సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు, ముదిరాజులు మామిడి వనంలోకి వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం వృక్షాన్ని నరికి మొద్దులను పట్టణానికి తరలించారు.
భీంగల్ పట్టణంలో నిర్వహిస్తున్న ఊర పండుగను పురస్కరించుకొని ఆదివారం పట్టణ పరిధిలోని మాసానికుంటకు సమీపంలో గల మామిడి చెట్ల వనంలోకి సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు, ముదిరాజులు గొడ్డళ్లతో వెళ్లి మామిడి వృక్షాన్ని నరికి గ్రామదేవతల తయారీకి అవసరమైన మొద్దులను సేకరించారు.
వనంలోకి వెళ్లిన అనంతరము మామిడి వృక్షానికి గొడ్డళ్లను ఉంచిన తర్వాత గ్రామదేవతల పూజారులు బద్దం శ్రీనివాస్, బద్దం శివకుమార్, పోతురాజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీంగల్ పట్టణంలో గల 21 గ్రామదేవతలకు సరిపడే విధంగా మామిడి వృక్షాన్ని నరికి వెంట తీసుకొచ్చారు.
భీంగల్ మున్సిపాలిటీ నుండి ఊరేగింపుగా వెళ్లి వడ్ల వారికి మామిడి మొద్దులను అందజేశారు. తర్వాత భూలక్ష్మి దేవాలయంలో పట్టుపరిచి పందిరి వేసి పోతురాజులు పాటలు పాడుతూ ఒక గొర్రెను బలి ఇచ్చారు. పోతురాజు మరో గొర్రెను గావు పట్టారు.
ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పతాని కృష్ణ, ఉపాధ్యక్షుడు తీగల రఘు, ప్రధాన కార్యదర్శి నిచ్చెం రాజేశ్వర్, కోశాధికారి ఎస్పీ. భూమేశ్వర్, పురపాలక సంఘం కౌన్సిలర్లు, పలు రాజకీయ పార్టీల నాయకులు, సేవలందించే వృత్తి కులాల వారు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.











