ఇందూరు (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
పూర్వ నిజామాబాద్ జిల్లా ఆర్య సమాజాల మహాసమ్మేళనం ఇందూరులోని ఆర్య సమాజం భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. యజ్ఞంతో ప్రారంభమైన ఈ సమ్మేళనంలో పలు కీలక తీర్మానాలు చేశారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు.
పూర్వ నిజామాబాద్ జిల్లా ఆర్య సమాజాల ఆర్య మహాసమ్మేళనం ఇందూరులోని ఆర్య సమాజం భవనంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం 9 గంటలకు యజ్ఞంతో ప్రారంభమైన ఈ సమ్మేళనంలో అనేక ఉద్యమస్ఫూర్తివంతమైన కార్యక్రమాలను చేపట్టారు. పలు కీలక తీర్మానాలు చేశారు.
మూడు నెలల తర్వాత అక్టోబర్ మాసంలో బోధన్ ఆర్య సమాజంలో జిల్లా సమ్మేళనం ఏర్పాటు చేయాలని, సర్వసభ్య సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా సంకల్పించారు. రెండవ అంశంగా, ప్రతినెల కామారెడ్డి ఆర్య సమాజంలో చివరి ఆదివారం నాడు కామారెడ్డి క్షేత్ర భాగంలో ఉన్న సమాజాలను చైతన్యపరిచేలా సత్సంగం నిర్వహించాలని నిర్ణయించారు.
మూడవ అంశంగా, ప్రతి ఆర్య సమాజంలో బాల వాడి కేంద్రాలను నెలకొల్పి, శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు. బాలలకు సంధ్యా విధి, యోగ, నైతిక శిక్షణ వంటి అంశాలలో తర్ఫీదు అందించాలని నిర్ణయించారు. మరో ముఖ్య అంశంగా, ఆర్య వీర్దల్ శాఖను ఏర్పాటు చేసి, యువకులలో సుశిక్షణ, ధార్మిక, జాతీయ భావాలను నిర్మించాలని తీర్మానించారు. ప్రతి నిత్యం శాఖ నిర్వహించాలని కోరారు.
శ్రావణమాసంలో ఇంటింటా యజ్ఞాలను నిర్వహించాలని, పర్యావరణహితం కోసం చెట్లను నాటాలని, ప్రతి పురోహితుడు యజ్ఞంతోపాటు ఒక మొక్కను నాటాలని తీర్మానించారు. శ్రావణి ఉపకర్మతో పాటు ఆర్య సత్యాగ్రహ బలిదాన శ్రద్ధాంజలి ఘటించడం మరో ముఖ్య అంశంగా పేర్కొన్నారు. పాఠశాల సెలవు రోజుల్లో సదాచార బాలల శిక్షణ శిబిరాల ద్వారా వ్యక్తి నిర్మాణానికి కృషి చేయాలని కూడా తీర్మానించారు.
ఈ సభలో రాష్ట్ర బాధ్యులు డాక్టర్ ధర్మతేజ, జగన్మోహన్ రెడ్డి, రాజేశ్వర్, ధన్ పాల్ ఆర్య, వివిధ సమాజాల పదాధికారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇట్టి సభకు ఆర్య సమాజ అధ్యక్షులు శ్రీ మాంకాల విజయకుమార్, కార్యదర్శి తిరుమల శ్రీనివాస్ ఆర్య, కోశాధికారి కొత్తపల్లి శ్రీనివాస్, ఇందూరు ఆర్య సమాజ అధికారులు, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ప్రణవ్ కుమార్, ఆచార్య వేద మిత్ర, యోగ సిద్ధిరాములు, సుదర్శనమణి, సభ్యులు పాల్గొని సభను విజయవంతం చేశారు.











