భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతితో పాటు ప్రపంచ మేధావి అని మాజీ రాష్ట్ర జడ్పీటీసీ ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి అభివర్ణించారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ సర్పంచ్ బైరీ ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ దేశానికి దిక్సూచి వంటి వ్యక్తి అని, ఆయన కేవలం ఒక వర్గానికి కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికీ చెందిన మహనీయుడని అన్నారు. దేశ, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేధావిగా ఆయనను కొనియాడారు.
కొన్ని శక్తులు అంబేద్కర్ పేరును చెరిపివేయాలని ప్రయత్నించినా, ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. సమానత్వం, న్యాయం కోసం ఆయన చూపిన మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ రెడ్డి, బైరీ ఈశ్వర్, బాల్ రాజ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








