మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో మంగళవారం భారత ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకుంటూ, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
మంగళవారం ముధోల్ మండలంలో అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు చేపట్టారు. గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని బుద్ధనగర్, యశ్వంత్ నగర్, అంబేద్కర్ నగర్, అశోక్ నగర్, నాగార్జున నగర్, నాక్షన్ నగర్ లతో పాటు పలు గ్రామాలలో జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, అంబేద్కర్ బహుజనుల కోసం చేసిన పోరాటాన్ని, నిరుపేదల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అణగారిన వర్గాలు ఎదగడానికి అంబేద్కర్ చేసిన కృషిని గుర్తుచేశారు. ఆయన దూరదృష్టితో ఎన్నో గొప్ప కార్యాలు చేశారని పేర్కొన్నారు.
జయంతి వేడుకల్లో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు బహుమతులు అందజేశారు. ఎస్సీ హాస్టల్ లో చదువుకుంటున్న అశ్విని మొదటి బహుమతిని, సంజన రెండవ, మాయావతి మూడవ, గంగోత్రి నాలుగవ, ప్రతీక్ ఐదవ బహుమతిని అందుకున్నారు.
అంబేద్కర్ సేన యువజన సంఘం సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ షబానా బేగం ఇజాజోద్దీన్, ఉప సర్పంచ్ లావణ్య సాయి, గ్రామ పంచాయతీ ఈఓ అన్వర్ అలీ ఖాన్, విడిసి అధ్యక్షులు విఠల్, సాయన్న మంత్రివార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ పోతన్న యాదవ్, బీజేపీ మండల అధ్యక్షులు పోతన్న, నాయకులు తాటివార్ రమేష్, బత్తినోళ్ళ సాయినాథ్, నరేష్ దర్బార్, ఇమ్రాన్, షకీల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ నాథ్ రాథోడ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.








