జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామపంచాయతీలో పౌల్ట్రీ షెడ్ నిర్మాణం చేపడుతూ, లబ్ధిదారులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. ఈ పనులు సర్పంచ్ ఈర్ల చిన్నయ్య ఆధ్వర్యంలో, పంచాయతీ కార్యదర్శి పి. లింగయ్య పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
లబ్ధిదారుడు శ్రీనివాస్ గౌడ్‌కు మంజూరైన పౌల్ట్రీ షెడ్ నిర్మాణ పనులను సాంకేతిక సహాయకురాలు రజిత పరిశీలించగా, ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం ముత్యం పనులను పర్యవేక్షించారు. ఈ పథకం ద్వారా గ్రామంలో ఇప్పటికే ఐదు పశువుల పాకలు, ఒక పౌల్ట్రీ షెడ్ నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
సాంకేతిక సహాయకురాలు రజిత మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు, పశుపోషకులు పశువుల పాకలు, పౌల్ట్రీ షెడ్లు వంటి వ్యవసాయ అనుసంధాన ఆస్తులను నిర్మించుకుని ఆర్థికంగా బలోపేతం కావచ్చని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ పథకం వ్యవసాయ అనుబంధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుందని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.












