నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించొలి బీ గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రైతులు శనివారం రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. గ్రామ సమీప రహదారిపై రైతులు ఆందోళనకు దిగడంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
అరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనప్పటికీ, ధాన్యం సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, దీంతో ధాన్యం కుప్పలు వర్షాలకు తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు అధికారులను ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరారు. రైతుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు హెచ్చరించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.











