తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వారికి జూన్ 2వ తేదీన సన్మానం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన ఉద్యమకారుల వివరాల నమోదు ప్రక్రియను మిర్యాలగూడలో ప్రారంభించారు.
మిర్యాలగూడలోని అమర వీరుల స్థూపం వద్ద శుక్రవారం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాడి రాజు ఈ ప్రక్రియను ప్రారంభించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను తగిన విధంగా గౌరవించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించే ప్రస్తుత తరుణంలో, నిబద్ధత కలిగిన వారిని గుర్తించి సన్మానించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఉద్యమంలో పాల్గొన్నట్లు సరైన ఆధారాలు చూపగలిగే అర్హులైన ఉద్యమకారులు అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఫోరం పిలుపునిచ్చింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రజాప్రతినిధులు, ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులచే ఈ సన్మానం జరగనుంది.
ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారుల ఫోరం నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్ళపల్లి రవి, మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాడుగుల శ్రీనివాస్, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, సర్పంచ్ బెజ్జం సాయి, గిరిజన సమైక్య నల్గొండ జిల్లా కార్యదర్శి దీరవత్ లింగా నాయక్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు, టిజెఎస్ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతికుమార్ నాయక్, యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగోండి మురళి యాదవ్, బాలు నాయక్, రాజ్ కుమార్ ఉన్నారు.











