జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి, కొనుగోలు చేసిన నిల్వలను వెంటనే గోదాములకు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. గురువారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అర్లీ కె శ్రీ ఆంజనేయ స్వామి రైస్ మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు తీరు, నిల్వల పరిస్థితి, రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత కొనుగోలు చేయాల్సి ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేపడతామని రైతులకు భరోసా ఇచ్చారు.
కొనుగోలు చేసిన ధాన్యం సంచులను ఎప్పటికప్పుడు గోదాములకు, రైస్ మిల్లులకు తరలించేందుకు తగినన్ని లారీలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. లారీల కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యాన్ని తరలించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైస్ మిల్లులో జరుగుతున్న అన్లోడింగ్ ప్రక్రియను, మిల్లుల సామర్థ్యాన్ని, ఇప్పటివరకు దిగుమతి అయిన ధాన్యం వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే వాహనాలు నిలిచిపోకుండా వెంటనే అన్లోడింగ్ పూర్తి చేసి తిరిగి కేంద్రాలకు పంపాలని సూచించారు. అవసరమైతే అదనపు హమాలీలను నియమించుకోవాలని మిల్లుల నిర్వాహకులకు సూచించారు. మిల్లుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
కేంద్రంలో ఉన్న రైతులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా పనిచేసి గడువులోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కల్లూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో ధాన్యం నిల్వలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, గడువులోగా నిల్వలను గోదాములకు తరలించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సూచించారు.












