జొన్న పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపడతామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి ఆయన బైంసాలో సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శనివారం బైంసా సబ్ కలెక్టర్ కార్యాలయంలో జొన్న పంట కొనుగోలు ప్రక్రియపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జొన్న, మొక్కజొన్న పంటల కొనుగోలు ప్రక్రియను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేశామని, సరిపడినంత మంది హమాలీలు, లారీల ద్వారా కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ వివరించారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, పూర్తయిన కొనుగోలు ప్రక్రియ, ఇంకా కొనుగోలు చేయాల్సిన పంట వివరాలను ఆయన తెలియజేశారు.
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, పంటల అమ్మకంలో రైతులకు ఇబ్బందులు కలగకూడదని, కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు.
భైంసా డివిజన్ మండలాల వారీగా పంటల కొనుగోలు వివరాలను తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనంద్ రావు పటేల్, తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.












