మార్కెట్‌కు తెచ్చిన పంటను ప్రభుత్వం తప్పక కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. గురువారం సారంగాపూర్ మండల కేంద్రంతోపాటు కౌట్ల(బి), జామ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
ఎండలను సైతం లెక్కచేయకుండా రైతుల ఇబ్బందులను పరిష్కరించడానికి స్వయంగా తన అనుచరులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని గోదాములను పరిశీలించారు. రెండు వారాలలో మొక్కజొన్న, జొన్న, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఎండలో తూకం వేస్తున్న దాడ్వాయి, హమాలీలను ఆయన అభినందించారు.
రైతుల ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మొక్కజొన్న, జొన్న పంటలను తరలించడానికి స్థానికంగా ట్రాక్టర్లను వినియోగించుకోవాలని, అందుకు స్థానిక నాయకులు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ధాన్యం కొనుగోలు విషయమై జిల్లా కలెక్టర్‌తో సమగ్రంగా చర్చించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, కొనుగోలు పూర్తయ్యే వరకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.












