మెదక్, నిన్న(మంగళవారం) రాత్రి
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు బీహార్‌కు చెందిన వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలోని పరికిబండలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్‌లోకి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు బీహార్‌కు చెందిన వలస కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద తీవ్రతకు గదిలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. గాయపడిన వారిని రాజేష్, గంగారాం, సంజీవ్, లాలాన్, దబల్ నాథ్‌గా గుర్తించారు.
నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగినప్పటికీ, వంట చేస్తుండగా గ్యాస్ పేలిందంటూ అక్కడి వారు నమ్మించేందుకు ప్రయత్నించారు. ఈరోజు ఉదయం పోలీసులు వెళ్లి పరిశీలించగా అసలు విషయం బయటపడింది. గ్యాస్ అక్రమ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాది కాలంగా స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్రమంగా గ్యాస్‌ను ఫిల్లింగ్ చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












