ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, ఇచ్చోడ మండలం తలమాద్రి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అక్కేపెల్లి లక్ష్మణ్ శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు.
గుప్టి ఘాట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.
లక్ష్మణ్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, నాయకులకు సన్నిహితంగా ఉండేవారని పలువురు తెలిపారు.
మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు లక్ష్మణ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంత్యక్రియలు శనివారం తలమాద్రి గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.












