Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
నిర్మల్ జిల్లా కడెం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి వద్ద ఉన్న నగదును నిజాయితీగా కుటుంబ సభ్యులకు అప్పగించి కడెం అంబులెన్స్ సిబ్బంది తమ మానవత్వాన్ని చాటుకున్నారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన రుద్ర శివగోపి (46) తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శివగోపికి తలకు తీవ్ర గాయం కాగా, చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న కడెం అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతడిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
ఈ సందర్భంగా కడెం అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు మురళి మరియు వాహన చోదకుడు రాకేష్ బాధితుడి వద్ద ఉన్న రూ.4,510 నగదును భద్రంగా అతని భార్యకు అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు. అంబులెన్స్ సిబ్బంది మురళి, రాకేష్ చూపిన సేవాభావం, బాధ్యత, నిజాయితీని ఆసుపత్రి సిబ్బందితో పాటు బాధితుడి కుటుంబ సభ్యులు అభినందించారు.












