నేరడిగొండ, జూలై 30
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంటాల గ్రామానికి చెందిన రైతు రాథోడ్ ధనరాజ్‌కు చెందిన పశువుల కొట్టం వర్షాల ధాటికి కూలిపోవడంతో రెండు ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ఒక ఎద్దు నడుము విరిగిందని సమాచారం.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుంటాల గ్రామానికి చెందిన రైతు రాథోడ్ ధనరాజ్‌కు చెందిన పశువుల కొట్టం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూలిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో కొట్టంలో రెండు ఎద్దులు ఉండగా, కొట్టంలోని దూలాలు, నిర్మాణ సామగ్రి వాటిపై పడటంతో ఒక ఎద్దు నడుము విరిగి తీవ్రంగా గాయపడింది. మరో ఎద్దుకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో పశువుల కొట్టం పూర్తిగా దెబ్బతినడంతో రైతుకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లింది.
పశువులు తీవ్రంగా గాయపడటంతో రైతు కుటుంబం ఆందోళన చెందుతోంది. ఘటనను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, బాధిత రైతుకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు గాయపడిన పశువులకు పశువైద్య చికిత్స అందించి ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన నేరడిగొండ మండల కన్వీనర్ బానోత్ వసంత్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.












