ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసు శాఖకు కీలక సూచనలు జారీ చేశారు. తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. కాన్వాయ్‌ల కోసం గంటల తరబడి వాహనాలను నిలిపివేయడం, ప్రజలను రోడ్లపై ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు.
ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌పై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని సీఎం సూచించారు. ప్రజల పనులకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణ ఉండాలని పేర్కొన్నారు.
సీఎం ఆదేశాల అనంతరం రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో డీజీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, కాన్వాయ్ నిర్వహణ, ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా మార్చేందుకు త్వరలో ప్రత్యేక “ట్రాఫిక్ బ్యూరో” ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయకుండా సింగిల్ లైన్లో వాహనాలను అనుమతించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రద్దీ ప్రాంతాల్లో ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలని సూచించారు. వర్షాకాలం ముందు నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నివారణ చర్యలు చేపట్టాలని, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని డీజీపీ ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని, శాంతిభద్రతల విభాగం కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.












