భైంసా పట్టణంలోని గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 19వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ శివాజీ మహారాజ్ శౌర్యం, ధైర్యసాహసాలు, ధర్మపాలన, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని కొనియాడారు. గెరిల్లా యుద్ధ తంత్రంతో స్వరాజ్య స్థాపన చేసిన మహానాయకుడని ఆయన అన్నారు.
స్త్రీల గౌరవాన్ని కాపాడటంలో శివాజీ ఆదర్శ పురుషుడని, విద్యార్థులు ఆయన గుణాలను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని, శివాజీ ధైర్యసాహసాలు శాశ్వత ప్రేరణ అని పేర్కొన్నారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రాజు, డాక్టర్ ఓంప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దేశభక్తి గీతాలు ఆలపించారు. విద్యార్థులు శివాజీ జీవిత చరిత్రపై ప్రసంగాలు చేసి ఆయన వీరగాథలను వివరించారు.
వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్, డా.పవన్ కుమార్ లు శివాజీ మహారాజ్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


