ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫారాలు విక్రయిస్తున్న యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిర్మల్ జిల్లా కన్వీనర్ మూడపెల్లి దినేష్ డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లాలో కొన్ని పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా, తమ ప్రాంగణంలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని ఏబీవీపీ ఆరోపించింది. ఈ విషయంపై జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ దినేష్ మాట్లాడుతూ, బయట మార్కెట్ ధరల కంటే రెట్టింపు ధరకు ఈ వస్తువులను విక్రయిస్తూ, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఈ అక్రమ వ్యాపారాలపై టాస్క్ఫోర్స్ కమిటీల ద్వారా తక్షణమే తనిఖీలు నిర్వహించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రైవేట్ పాఠశాలలు కేవలం విద్యాబోధనకు సంబంధించిన ఫీజులను మాత్రమే వసూలు చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు గణేష్, అభి, సాయికుమార్, శివకుమార్, మున్నా, పవన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.










