రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా, ఆర్మూర్ మండలంలో ఓటర్లకు సరైన అవగాహన కల్పించకుండానే దరఖాస్తుల పంపిణీ జరుగుతోందని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ప్రతి ఓటరుకు దరఖాస్తు నింపడంపై అవగాహన కల్పించాల్సిన బూత్ స్థాయి అధికారులు, ఆర్మూర్ మండలంలోని నాలుగో, ఐదో వార్డుల్లో ఓటర్లకు దరఖాస్తులు ఇచ్చి, వారే స్వయంగా నింపుకోవాలని సూచిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అవగాహన లేని ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి, ఓటర్లకు సరైన అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై నాలుగో వార్డు నాయకుడు నడుకుడ నాగరాజు, ఐదో వార్డు నాయకుడు ఇందూర్ విజయ్ కుమార్ స్పందిస్తూ, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.












