ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ల్యాండ్ ఆక్విజిషన్) నాయక్వాడి జల కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మితో కలిసి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులకు పంపి, పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన వివిధ రకాల దరఖాస్తులు ప్రజల నుంచి అందినట్లు అధికారులు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత కాలవ్యవధిలోగా వాటిని తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులకు జల కుమారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












