మాంసాహారం వండలేదన్న కారణంతో భర్తతో గొడవపడిన భార్య, క్షణికావేశంలో కొడవలితో దాడి చేసి భర్తను హత్య చేసిన దారుణ ఘటన కామారెడ్డి జిల్లాకేంద్రంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
కామారెడ్డి పట్టణానికి చెందిన కోదండం శివాజీ (28)కి, లక్ష్మికి 2017లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చిన శివాజీ, మాంసాహారం వండలేదని లక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి పెద్దదైంది. చుట్టుపక్కల వారు వచ్చి సముదాయించినా, గొడవ సద్దుమణగలేదు.
మళ్లీ తనను తిట్టడంతో ఆగ్రహించిన లక్ష్మి, అక్కడే ఉన్న కొడవలిని శివాజీపైకి విసిరింది. ఆ కొడవలి అతని మెడలోని నరానికి తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగి, కొద్దిసేపటికే శివాజీ మరణించారు.
భర్త మరణంతో కన్నీరుమున్నీరైన లక్ష్మి, పిల్లలను చూసుకునేవారు ఎవరు అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడి సోదరుడు సూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ నరహరి తెలిపారు.











